నల్లగొండ, ఆగస్టు 1 : అరకొర రైతు రుణమాఫీ అన్నదాతలను ఆగ్రహానికి గురిచేస్తున్నది. ప్రతి రైతుకు రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించగా వాస్తవంగా అందుకు విరుద్ధంగా ఉన్నది. జూలై 30న రెండో విడుతగా రూ.1.50 లక్షలు రుణం మాఫీ చేస్తున్నట్లు చెప్పినా సగం మందికి మాఫీ కాలేదు. నల్లగొండ జిల్లా 83వేల మంది రైతులకు సంబంధించి రూ.1014.68 కోట్లు మాఫీ అవుతుందని అధికారులు చెప్పగా బుధవారం నాటికి 43వేల మంది రూ.503. 89 కోట్లు మాత్రమే జమయ్యాయి.
దాంతో ఏఈఓల నుంచి డీఏఓ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లాలో బుధవారం 2,450, గురువారం 3,500 దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి విడుతలో రూ.481 కోట్లు రుణ మాఫీ కావాల్సి ఉండగా పలు కారణాలతో రూ.465 కోట్లే అయ్యాయి.
పలు కారణాలతో మాఫీ కట్
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసే పలు నిబంధనలు పెట్టింది. తొలుతగా కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మాఫీ కట్ చేయగా ఆ తర్వాత ఐటీ చెల్లించే వారికి, ఐటీ రిటర్న్స్ చేసే వారికి సున్నా పెట్టింది. మెజారిటీ రైతుల్లో రేషన్ కార్డు లేదనే కారణంతో పక్కకు పెడుతున్నదని వ్యవసాయ శాఖకు వచ్చే ఫిర్యాదుల బట్టి బయట పడుతున్నది. ఇక రైతులు రుణం తీసుకున్న బ్యాంకుల్లో ఒకే ఆధార్ కార్డు ఇద్దరు ముగ్గురు పేరుతో కాపీ చేసి కొట్టినా, వారు సరైన రికార్డులు పంపకపోయినా, వ్యవసాయ అదికారులు తప్పుడు నివేదిక ఇచ్చినా చివరికి రైతే నష్టపోవాల్సి వస్తున్నది. చాలా రైతు ఖాతాదారుల్లో మాత్రం నో రికార్డ్స్, నో రేషన్ కార్డు అనే కారణాలే ఉన్నట్లు తెలుస్తున్నది.
రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేసిండు
నేను లక్ష రూపాయాలు పంట రుణం తీసుకున్నా. 7 వేల రూపాయల వడ్డీ అయ్యింది. రెండో విడుతలో లక్షన్నర రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పగా నాకు మాత్రం మాఫీ కాలేదు. కారణమేంటని తెలుసుకుంటే రేషన్ కార్డులేని వాళ్లకు ఇవ్వట్లేదని అర్థమైంది. అలాంటప్పుడు అందరికీ రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఎందుకు.. రైతులను మోసం చేసేంది ఎందుకు? రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడదు.
-సుధాకర్‌రెడ్డి, రైతు, చిత్తలూరు గ్రామం, పెద్దవూర మండలం
కొర్రీలు పెడుతున్నరు
రెండు లక్షల మాఫీ చేయమని ఎవరు చెప్పిం డ్రు. ఎవరు ఇవ్వమన్నరు. చేస్తే అందరికీ చేయండి. రేషన్ కార్డు ప్రమాణికం పెట్టకండి. అందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డును బట్టి చేస్తున్నారు. ఇవ్వాల ఇన్ని కొర్రీలు పెడితే ఎలా. మాది ప్రజాపాలన అని చెప్పి రైతులను మభ్యపెట్టి మోసం చేయొద్దు. చాలా మందికి లక్ష రుణం ఉన్నా ఇప్పటి వరకు కాలే. రైతులు ప్రభుత్వంపై తిరుగబడే సమయం ఆసన్నమైంది.
-చల్లారెడ్డి, రైతు, బుధ్ధారం, నల్లగొండ మండలం
లక్ష రుణం తీసుకున్నా.. మాఫీ కాలే
నేను ఎన్నికల ముందు లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నాను. వడ్డీ కలిపి మరో పది వేలు పెరిగింది. ఫస్ట్ సారే రుణమాఫీ అవుద్ది అనుకున్నా. కానీ రెండో సారి కూడా కాలేదు. ఊర్ల ఉన్న వ్యవసాయ అధికారిని అడిగితే కాలేదన్నాడు. అదేందని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వస్తే నో రికార్డ్స్ అని వస్తుందంట. అదేందంటే మాకు తెల్వదు అంటున్నారు. కారణం కూడా ఏం తెలిసే పరిస్థితి లేకపోవటంతో అసలు అవుద్దా కాదా అనేది అర్థం కావట్లేదు.
-నామ తార, చిన్న సూరారం, నల్లగొండ మండలం