నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అభిమాన నేత పుట్టిన రోజు వేడుకను బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. సేవా కార్యక్రమాలతో గులాబీ దళపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేశారు.
రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులు, అనాథలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. సర్వమత ప్రార్ధనలు చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తోచిన సాయం చేశారు. నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో చైర్మన్ గుత్తాతోపాటు జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, గుత్తా అమిత్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.
అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ైస్మైల్ కార్యక్రమం పేరుతో గుత్తా అమిత్‌రెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌కు 80 వేల విలువైన ఐదు డోనర్ టేబుల్స్‌ను అందిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండతో కలిసి కేట్ కట్ చేశారు. దేవరకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. హాలియాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కట్ చేశాయి.
హాలియాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రక్తదానం చేశారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ కేట్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భాస్కర్‌రావు కేక్ కట్ చేశారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో వీల్స్ ఆన్ మీల్స్ ప్రోగామ్లో భాగంగా 500 మంది రోగులకు అల్పాహారం అందజేశారు. టీఆర్ఎస్వీ నేత బొమ్మరబోయిన నాగార్జున ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.