నల్లగొండ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 04 : రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ నెలకొన్నదని, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణ యుగంలా ఉండేదన్నారు. 2017 నాటికి నల్లగొండ జిల్లా 40 లక్షల టన్నుల ధాన్యాన్ని అందించినట్లు చెప్పారు. వ్యవసాయం పండుగలా మార్చినట్లు, అప్పుడు నిత్యం సమీక్షలు పెడుతూ అనుక్షణం అప్రమత్తంగా ఉండి అన్నదాతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సమకూర్చినట్లు తెలిపారు.
దురదృష్టవశాత్తు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా సమీక్షలు లేవు, ఒరిగింది శూన్యం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలకులు అన్ని రంగాల్లో విఫలమైనట్లు తెలిపారు. రైతులు అన్ని విషయాల్లో మోసపోయినట్లు చెప్పారు. ఇప్పటివరకు 30 శాతం కూడా రుణమాఫీ జరుగలేదు. రైతు భరోసా లేదు. ధాన్యం కొనుగోళ్లు లేవు. బోనస్ లేదు. మొత్తంమీద రైతులు అప్పుల పాలైనట్లు చెప్పారు. మంత్రులు కమీషన్లు తింటూ దళారులకు అమ్ముడు పోయినట్లు దుయ్యబట్టారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదని, తమ పాలనలో మిల్లర్ల వద్ద ఉండి పర్యవేక్షణ చేస్తూ మద్దతు ధర అందించినట్లు వెల్లడించారు. ఇప్పుడు మిల్లర్లు, దళారుల వద్ద కమీషన్లు తింటూ మంత్రులు రైతులను నట్టేట ముంచుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. బోనస్ అంశం బోగస్ అయిందన్నారు. బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. నల్లగొండలో ఓ మంత్రికి సోయి లేదని, ఎప్పుడు మైకంలో ఉంటాడని, రైతులంటే లెక్కేలేదని, కమీషన్ల దందాలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఎవ్వరు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని, తాము కేసులకు భయపడే వాళ్లం కాదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా గాల్లో హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా మాట్లాడుతున్నారని, జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అంతేగానీ కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడొద్దని హితవు పలికారు. పోలీసులు కూడా అతి చేయొద్దని, చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు.