కట్టంగూర్, ఏప్రిల్ 16 : వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్, కురుమర్తి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నర్సరీలను పరిశీలించారు. కూలీలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని మస్టర్ రోల్స్, హాజరు వివరాలను పరిశీలించి మాట్లాడారు. ఎండ తీవ్ర కారణంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల లోపు పని కూలీలు ప్రదేశాలకు హాజరు కావాలని సూచించారు.
అనంతరం ఎస్ఏహెచ్ మహిళలతో సమావేశమై ఉపాధి అవకాశాలు బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాలను సమయానికి చెల్లించి ప్రభుత్వం పథకాలను సద్వియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ రాగానే ధాన్యాన్ని కాంటా వేసి మిల్లర్లకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ముక్కామల శేఖర్, ధార సత్తెమ్మ భిక్షం, ఏపీఓ కడెం రాంమోహన్, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్, ఈసీ శ్రీధర్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.