నకిరేకల్, జూన్ 21 : యువకుడి కళ్లల్లో కారం కొట్టి.. శరీరంపై పిడిగుద్దులు కురిపించి, గడ్డి చెక్కే పారతో శరీరాన్ని చెక్కి, మర్మాంగాలను వడేసి, ఆపై చెట్టుకు కట్టేసి కాళ్లు విరగ్గొట్టిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సింగ్ జానయ్య (34). వృత్తి రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన తల్లితో కలిసి నోముల గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనమ్మ అనే వివాహితతో జానయ్యకు గత 8 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకూ పంచాయతీ వెళ్లింది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పంపించేశారు.
ఇదే విషయమై గత సంవత్సరం అక్టోబర్‌లో ధనమ్మ ఆమె భర్త నాగరాజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జానయ్య అరెస్ట్ అయి జైలుకి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని నెలలు దూరంగా ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి జానయ్య వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో లేడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విషయాన్ని ధనమ్మ కూతురు తన తండ్రి నాగరాజుకు ఫోన్ చేయడంతో నాగరాజు ఆవేశంతో ఇంటికి వచ్చాడు. నాగరాజు, ధనమ్మ, వారి కూతురు, ధనమ్మ తల్లి నలుగురు కలిసి జానయ్యను వారి ఇంట్లోనే విచక్షణా రహితంగా కొట్టి మర్మాంగాలపై, చాతిపై పిడిగుద్దులు గుద్ది, పత్తి చేనులో వాడే గడ్డి పారతో శరీర భాగాలను చెక్కారు. అనంతరం వారి ఇంటి ముందు చెట్టుకు చీర, తాళ్లతో కట్టేశారు. కళ్లల్లో కారం కొట్టి మళ్లీ కొట్టారు. మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టడంతో జానయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
జానయ్య బంధువు వచ్చి కట్లు విప్పేసరికి అంబులెన్స్ వచ్చింది. అక్కడే ప్రథమ చికిత్స అందించి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జానయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 7.40 గంటలకు జానయ్య మృతిచెందాడు.
కాగా నోముల గ్రామానికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జానయ్యను ఆస్పత్రికి తరలించే సమయంలోనే ధనమ్మ, నాగరాజు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము జానయ్య కొట్టామని చెప్పి లొంగిపోయారు. శనివారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో దంపతులు సరెండర్ అయినట్లు సమాచారం. జానయ్య తల్లి నర్సింగ్ ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం జానయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని సీఐ రాజశేఖర్ తెలిపారు.
Nakrekal : కళ్లల్లో కారం కొట్టి.. పారతో శరీరాన్ని చెక్కి.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం