నకిరేకల్, జులై 10 : కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారస్తులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అధిక ధరలకు, దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నకిరేకల్ మండలాధ్యక్షుడు బుడిగె సైదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నకిరేకల్ వ్యవసాయ అధికారి ఎండీ జానిమియాకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 60 శాతం, ఎరువు డీలర్ల ద్వారా 40 శాతం ఎరువుల విక్రయాలు జరిగేలా, ప్రతి మండల కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు, బఫర్ స్టాక్ ఉంచాలని, రవాణా ఛార్జీలు రైతులపై పడకుండా మార్క్‌ఫెడ్ వారే భరించాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మండల మాజీ అధ్యక్షుడు యానాల శ్రీనివాస్‌రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల సాయన్న, జిల్లా నాయకులు డాకయ్య, కొండేటి శ్రీను, తాటికొండ రామ్మూర్తి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చెనగాని రాములు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, రాచకొండ పెద్దులు ఉన్నారు.