నీలగిరి, మే 04 : ఆదివారం సంభవించిన గాలివాన ప్రభావంతో నల్లగొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం గాలివాన నేపథ్యంలో నగర పారిశుధ్య పరిస్థితిని సమీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ సోమవారం 36, 37వ డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే శుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

గాలివాన అనంతరం వేగంగా శుభ్రతా చర్యలు : మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర
పర్యటనలో భాగంగా కమిషనర్ సంబంధిత డివిజన్లలో రోడ్ స్వీపింగ్, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు, డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమాలను పరిశీలించారు. గాలివాన కారణంగా పడిపోయిన చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తక్షణమే తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులను శుభ్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా నగరంలోని నీరు నిల్వ అయ్యే (Water Logging) ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని, డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించి, అన్ని డ్రైన్లు స్వేచ్ఛగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్ని శానిటరీ జవాన్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే గల్ఫర్ (Gulfer) యంత్రాల సహాయంతో బ్లాక్ అయిన డ్రైన్లను క్లియర్ చేయాలని సూచించారు.

గాలివాన అనంతరం వేగంగా శుభ్రతా చర్యలు : మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్ని ప్రధాన, ఉప డ్రైన్లను అత్యవసరంగా డిసిల్టింగ్ చేసి, నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి, శానిటరీ జవాన్లు, సంబంధిత వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.