మున్సిపాలిటీలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, పచ్చని చెట్ల పెంపకంతో సుందరంగా మార్చుతున్నది. కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు, డంపింగ్ యార్డులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నది. పనులు ముమ్మరంగా సాగుతుండడంతో పట్టణవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, జనవరి 10 (నమస్తే తెలంగాణ)
సర్వహంగులతో భువనగిరి
భువనగిరి మున్సిపాలిటీ పురోగతిలో పరుగులు పెడుతున్నది. ఇప్పటి వరకు రూ.52 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పట్టణంలో రూ.18 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. రూ.88లక్షలతో భువనగిరి చెరువు వద్ద చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడే ఏర్పాటు చేసిన లవ్ భువనగిరి సెల్ఫీ పాయింట్ ఆకట్టుకుంటున్నది. సమీకృత మార్కెట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్లాంటేషన్ పనులు పూర్తవడంతో పట్టణంలో ఆహ్లాదకరంగా మారింది. రూ.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ రాత్రి వేళ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మున్సిపల్ సాధారణ నిధులు రూ.14 కోట్లతో సీసీ రోడ్లు, రూ.4 కోట్లతో బీటీ రోడ్లు, రూ.10 కోట్లతో డ్రైనేజీలను నిర్మించారు.
అభివృద్ధికి కేరాఫ్‌గా ఆలేరు
ఆలేరు మున్సిపాలిటీలో గతానికి భిన్నంగా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు సాగుతున్నది. 2018లో మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 26.32 కోట్లతో పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, బటర్‌ఫ్లై విద్యుత్ కాంతులు, సులబ్ కాంప్లెక్స్ నిర్మించారు. చివరి మజిలీకి చింత లేకుండా అని హంగులతో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తెచ్చారు.
సుందరంగా పోచంపల్లి
2018లో ఆగస్టులో భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడింది. రూ. 7.15కోట్లతో పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. బటర్‌ఫ్లై సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పోచంపల్లి పట్టణంలో జిగేల్మని వెలుగుతున్నది. 60ఫీట్లతో రోడ్డు, కొత్త మంచి నీటి పైప్‌లైన్ వేశారు. రూ. 25లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. పచ్చదనం, పారిశుధ్యానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా పర్యాటకులు వచ్చే పోచంపల్లిలో గతంలో సరైన రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవతో ఈ సమస్య తీరింది.
రూ.19.50 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అయిన తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు టీఎఫ్ఐసీ నుంచి రూ.19.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.5కోట్లతో 12 వార్డుల్లో సీసీ రోడ్లు పూర్తి చేశారు. రూ.కోటి తో 2, 4, 11 వార్డుల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు పార్కులు నిర్మిస్తున్నారు. రూ.10 కోట్లతో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు కాల్వల పునరుద్ధరణ పనులను చేపట్టారు. పట్టణ ప్రగతిలోభాగంగా రూ.41 లక్షలు మంజూరు కాగా 12 వార్డుల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి చేశారు. రూ.కోటితో మలమూత్ర విసర్జన ప్లాంటును నిర్మిస్తున్నారు. రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణం పూర్తయింది.
చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ. 152 కోట్ల నిధులు వచ్చాయి. ఏడు గ్రాంట్ల నుంచి ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో పట్టణంలో సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు నిర్మించారు. మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్ణణంలోని పైలాన్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రహదారి వెంట భారీగా మొక్కలు నాటారు.
మోత్కూరులో రూ.10.40కోట్ల అభివృద్ధి
మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.40కోట్లు కేటాయించింది. వీటితో రోడ్డు వెడల్పు, బీటీ రోడ్డు మధ్యలో డివైడర్, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రూ. కోటి వ్యయంతో వైకుంఠధామం, రూ 2కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు ప్రగతిలో ఉన్నాయి.
అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి
మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో ప్రభుత్వం నుంచి రూ.10.40 కోట్లు మంజూరయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. పాలకవర్గం, ప్రజల సహకారం ముందుకు వెళ్తున్నాం.
-తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోత్కూరు
స్వరాష్ట్రంలోనే ఆలేరు అభివృద్ధి
ఆలేరు మున్సిపాలిటీ స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధించింది. గతానికి భిన్నంగా పట్టణం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నది. మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రేనేజీ మెరుగుపడింది. కాలనీల్లో సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి.
– ఆడపు బాలస్వామి, స్థానికుడు, ఆలేరు
ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కృషితోనే అభివృద్ధి
మంత్రి కేటీఆర్ సహకారం, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కృషితోనే భువనగిరి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. భువనగిరి పట్టణంలో ఇప్పటికే ప్రధాన రహదారి వెడల్పు, మినీ ట్యాంక్ బండ్, అన్ని వార్డుల్లో అవసరమున్న చోట సీసీ, బీటీ రోడ్లు వేశారు. వైకుంఠధామం, డ్రైనేజీలు, పారులు నిర్మించారు.
-ఎన్నబోయిన ఆంజనేయులు, భువనగిరి మున్సిపల్ చైర్మన్