రామగిరి, జనవరి 3 : బాలల శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణలతో భళా అనిపించారు. సృజనాత్మకతతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి అబ్బుర పరిచారు. జిల్లా సైన్స్ ఫెయిర్ – ఇన్స్పైర్ మానక్ అవార్డుల 2023-24 ప్రదర్శన నల్లగొండలోని డాన్‌బాస్కో స్కూల్లో శుక్రవారం ప్రారంభమైంది. ఎగ్జిబిట్లు తెచ్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లు, సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆ ప్రాంగణమంతా సందడిగా కనిపించింది. ‘సుస్థిర అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పాత్ర’ అనే ప్రధానాంశంతోపాటు బీఈడీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన టీచర్ లెర్నింగ్ పరికరాలు ప్రదర్శించారు.
జిల్లా వ్యాప్తంగా 215 సైన్స్ ప్రాజెక్టులు, బీఈడీ విద్యార్థుల టీఎల్ఎం, 106 ఇన్స్పైర్స్ ప్రాజెక్టులు కలిపి మొత్తం 321 ఆవిష్కరణలను ప్రదర్శించారు. తొలి రోజు ప్రదర్శనను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్తులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ ద్వారా శాంతి సమాజాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు.
సైన్స్ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలన్నారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్పూర్తితో పని చేసి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ జీవన శైలిని ఉన్నతంగా మార్చే శక్తి సైన్స్‌కు ఉందన్నారు. రిలేటివిటీ థియరీకి సైన్స్ పునాది వేసిందని తెలిపారు. విద్యార్థులు సైన్స్, గణితం అంశాలకు సంబంధించి రోజూ ఒక్క పేజీ అయిన కచ్చితంగా చదువాలని సూచించారు.
అనంతరం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. సాయంత్రం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డీఈఓ బి.భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈఓ నంద్యాల ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, నల్లగొండ ఎంఈఓ అరుంధతి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డాన్‌బాస్కో పాఠశాల ప్రిన్సిపాల్ బాలశౌరీ, ఉప రవాణా శాఖ కమిషనర్ వాణి పాల్గొన్నారు. సైన్స్‌ఫెయిర్ శనివారం ముగియనుంది. సాయం త్రం 4గంటలకు విజేతలకు బహుమతుల ప్రదానం చేయడంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్లను వెల్లడిస్తారు. ముఖ్యఅతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం.
నేటి ఆధునిక యుగంలో యాంత్రీకరణ ఎంతో పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు సీహచ్.రాఘవేంద్ర, కార్తీక్ చిన్నబ్యాటరీలు, అట్టముక్కలు, గ్లౌజులు ఉపయోగించి రోబో తయారు చేశారు. ఇది తల తిప్పడం, కరచలనం చేయడంతోపాటు పలు విధాలుగా ఉపయోగపడుతుంది.
– సీహెచ్.రాఘవేంద్ర, సీహెచ్.కార్తీక్, 9వ తరగతి విద్యార్థులు, జడ్పీహెచ్ఎస్ బాలురు దేవరకొండ(గైడ్ టీచర్-పండరీనాథ్)
ప్రతి అంశానికి గణితం ముడిపడి ఉంటుంది. కానీ విద్యార్థులకు గణితం అంటే బయపడుతుంటారు. 6వ తరగతి చదివే యశ్వంత్ మాత్రం టైపుస్ ఆఫ్ యాంగిల్స్‌ను సులభంగా నేర్చుకునేలా ప్రాజెక్టు తయారు చేసి అందరినీ అబ్బురపర్చాడు. మ్యాథమెటిక్స్ పార్క్ అంటూ అట్ట పెట్టతో యాంగిల్స్ గడియారం రూపంలో నిర్మించి వివరించాడు.
– బి.యశ్వంత్, 6వ తరగతి విద్యార్థి, జడ్పీహెచ్ఎస్, కొండమల్లేపల్లి (గైడ్ టీచర్ – కె.శ్రీనివాస్)
విద్యార్థులకు పాఠ్యంశాలను బోధనను బోరుపై బొమ్మలు గీసి చెప్తే అంతగా గుర్తుండదని, టీఎల్ఎం-టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్‌ను చూపించి చెప్పడంతో అర్థవంతంగా ఉంటుందని నల్లగొండలోని డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛాత్రోపాధ్యాయులు వెల్లడించారు.
వాసవ విషయాలను విద్యార్థుల కండ్ల ముందు ఉంచి పాఠ్యాంశాలు చెప్తే ఎక్కువ రోజులు గుర్తుంటుందన్నారు. ఈ మేరకు ‘లోకాస్ట్ టీఎల్ఎం – విత్ వర్కింగ్ మోడల్స్’ అనే అంశాలను వేస్ట్ మెటీరియల్స్‌ను ఉపయోగించి చేశారు.’ చెక్కలు- బోల్టులతో సూక్ష్మదర్శిని చేసి మొబైల్‌తో వాటిని వీక్షించి చిత్రాలను ఫోటోలు తీసుకోవడం తయారు చేశారు. ధూమపానంతో ఊపిరితిత్తులు చెడిపోయ్యే విధాన్ని చూపించారు. దంతాల నిర్మాణం, అస్థిపంజరం, డీఎన్ఏ, కప్ప, సీతాకోకచిలుక, న్యూరాన్ నిర్మాణాలను ప్రదర్శించారు. విటమిన్స్‌ను రైలుబండి రూపంలో చూపించడంతో పిల్లలు, ఉపాధ్యాయులు ఆసక్తిగా వీక్షించారు. సైన్స్ బ్యాడ్జీలు, సులభంగా గుణింతాలు, కూడికలు చేసుకునే మోడల్స్‌ను అట్టముక్కలు, దారాలతో తయారు చేసి చూపించారు.
– గైడ్ అధ్యాపకుడు – బొడ్డుపల్లి రామకృష్ణ, డీవీఎం కాలేజ్, నల్లగొండ)
-బి.మత్స్యగిరి, 9వ తరగతి విద్యార్థి, నక్కలపల్లి జడ్పీహెస్ఎస్, నార్కట్‌పల్లి మండలం (గైడ్ టీచర్-మారోజు ఉమ
వర్షపు నీరు వృధా కాకుండా ఇంటి పైనుంచి పైపులు ఏర్పాటు చేసి ఇంకుడు గుంత ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి సంపులోకి వెళ్లేలా ఎగ్జిబిట్‌ను నక్కలపల్లి జడ్పీహెస్ఎస్ విద్యార్థి బి.మత్స్యగిరి ప్రదర్శించారు. ఇలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భంలో నీటి నిల్వలు పెరుగడంతోపాటు బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీళ్లు ఉంటాయని వివరించాడు. సంపులో నింపిన నీరు ఇంటి అవసరాలకు వాడుకునే విధానాన్ని చెప్పాడు.
ఇన్స్స్పైర్స్ మానక్ అవార్డుకు ఎంపికైన ప్రాజెక్టు ఇది. పనికిరాని సైకిల్ తీసుకుని దాని వెనుక చక్రం తొలగించారు. దానికి ఇరుసు ఏర్పాటు చేసి ఇంట్లోని చిన్న వాటర్ డ్రమ్‌కు బిగించారు. డ్రమ్‌లో ప్రత్యేకమైన జాలితో బట్టలు వేసుకునేలా దానికి మూత ఉండేలా బిగించారు. సైకిల్ పెడెల్ తొక్కడంతో డ్రమ్‌లో ఏర్పాటు చేసి జాలి గుండ్రంగా తిరుగుతుంది. దీంతో అందులో వేసిర బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏవిధంగా అయితే ఉతుకుతాయో అలాగే పని చేయడం జరుగుతుంది. సైకిల్ వాషింగ్ మిషన్‌తో కండర శక్తి యాంత్రిక శక్తిగా మారుతుందని భరత్ వివరించాడు. దాంతో ఓ వైపు వ్యాయమం, మరో వైపు బట్టలు ఉతకడం జరుగుతుందని తెలిపారు.
-ఎ.భరత్, 10వ తరగతి విద్యార్థి, జడ్పీహెచ్ఎస్ కొండ్రపోల్, దామరచర్ల మండలం(గైడ్ టీచర్ -ఆనంద్)