కేతేపల్లి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి పది నెలలు దాటినా పరిపాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండల పరిధిలోని ఇనుపాములలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై చిల్లర మాటలు మాట్లాడటం మినహాయించి సీఎం రేవంత్‌రెడ్డికి ఏమీ తెలియడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విష జ్వరాలు ప్రబలడంతో ప్రభుత్వ దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయని, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలను కల్పించడంలో, మందుల కొరతపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంత వరకు పూర్తి చేయకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. వానకాలం పంటకాలం పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం రైతుబంధు ఊసెత్తకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి మాటతప్పడం సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ అందుబాటులో లేకుండా ప్రజలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, పారిశుధ్య పనులు పనులు చేపట్టక పోవడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడు నెలలు దాటినప్పటికీ ఇంత వరకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో కేవలం కమీషన్ల కోసమే హైడ్రాను తెరమీదకు తీసుకువచ్చారని విమర్శించారు. హైడ్రా ఏర్పాటుతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, పేదల జీవితాలతో చెలగాటమాడుతూ గుంపుమేస్త్రీ కాలం గడుపుతున్నాడని మండిపడ్డారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, జాల వెంకట్‌రెడ్డి, ఎం.రాగ్ని, జి.సత్యనారాయణగౌడ్, సీహెచ్.గోపాల్‌గౌడ్ పాల్గొన్నారు.