నీలగిరి, నవంబర్ 20 : జిల్లాలో ఆడ శిశువుల విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక అత్యాచారాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని చర్లపల్లి సెక్టార్ పరిధిలో అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భణీలకు బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాలికలపై లైంగిక వేధింపుల నిరోధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అవగాహాన లేకపోవడం వల్ల ఆడ పిల్లలను అక్రమంగా దత్తత ఇవ్వడం, బాల్య వివాహాలు చేస్తున్నారని వీటిపై అవగాహన కల్పించాలన్నారు.
ఆడ పిల్లలను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, బాల్యవివాహాలు అరికట్టే బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే వెంటనే సమాచారం అందజేయాలన్నారు. ఈ విషయంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, అక్రమ దత్తత, యువత మత్తు మందులకు బానిసలు కాకుండా ఉండే అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల మాట్లాడుతూ.. ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు తదితర అంశాలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఆడబిడ్డ సంరక్షణపై అవగాహన కల్పించాలని, మీ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి అడపిల్ల ఇంటికి బలం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. అనంతరం నల్లగొండ మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి ఎన్టీఆర్ కాలనీలోని గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్లు లక్షమ్మ, లావణ్య, ఉపశ్రీ, సువర్ణ, సుజాత, స్వరలత, పుష్ప, మోహినుద్దిన్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Nilagiri : శిశు విక్రయాలు, బాల్య విహహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : కేవీ కృష్ణవేణి