నీలగిరి, మే 08 : 2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం ముఖ్య ప్రణాళిక అధికారి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన “జనగణన నడకను” కలెక్టర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
2027 జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గణన, గృహాల లెక్కింపు, జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 26న ప్రారంభమైన స్వీయ గణన ఈ నెల 10తో ముగుస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని వారి వివరాలన్నింటిని ఇవ్వాలని కోరారు. ఈ నెల 11 నుండి ఎన్యుమరేటర్లు ఇల్లిల్లు తిరిగి హౌస్ లిస్టింగ్ చేస్తారని చెప్పారు. జిల్లాలో 20 లక్షల మంది జనాభా ఉండగా 5,50,000 ఇండ్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 12,000 కుటుంబాలు స్వీయగణన చేసుకోవడం జరిగిందని, తక్కిన వారందరూ కూడా స్వీయ గణనలో భాగస్వాములు కావాలన్నారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్వీయ గణన పై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం “జనగణన వాక్” నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఇంటి నుండే సెల్ ఫోన్ లో స్వీయ గణన చేసుకోవచ్చని, ఇందుకు కేవలం 10 పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. స్వీయ గణనకు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సిపిఓ శ్రీనివాస్ నాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల అధికారి అక్బర్ అలీ, తాసీల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఈ 10 లోగా ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్