కోదాడ, సెప్టెంబర్ 14 : కోదాడ నియోజకవర్గం మూడు నెలల నుంచి వైరల్ ఫీవర్స్‌తో విలవిల్లాడుతున్నది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరు జ్వర పీడితులు ఉంటున్నారు. దీనికితోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇండ్లలోకి నీరు చేరడంతోపాటు వీధులన్నీ బురదమయమై పారిశుధ్యం అధ్వానంగా తయారైంది.
దాంతో ఈ వ్యాధులు మరింతగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో డెంగ్యూతో నలుగురు చనిపోయినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. వైద్యాధికారులు గ్రామాలను సందర్శించి వెళ్తున్నారే గానీ.. వైద్య సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడలో 30 పడకలు, నడిగూడెంలో 10 పడకల దవాఖానలో పూర్తిస్థాయిలో వైద్యులు లేక రోగులకు సరైన సేవలు అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.
30 పడకల దవాఖానలో ముగ్గురే వైద్యులు..
కోదాడ పట్టణంలోని 30 పడకల దవాఖాన సమస్యల కూపంగా మారింది. నియోజకవర్గవ్యాప్తంగా ఈ దవాఖానకు గతంలో 350 నుంచి 400 దాకా రోగులు వచ్చేవారు. ఇక్కడ మొత్తం 16 మంది వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. సూపరింటెండెంట్ దశరథనాయక్తోపాటు జనరల్ సర్జన్, కాంట్రాక్ట్ పద్ధతిలో గైనకాలజిస్ట్ మాత్రమే సేవలందిస్తున్నారు. పూర్తిస్థాయి వైద్యులు లేక 24 గంటలు వైద్య సేవలు అందడం లేదు.
దాంతో రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తున్నది. 30 పడకల దవాఖానలో రక్త పరీక్షలకు కూడా రెండు, మూడు రోజుల సమయం పడుతున్నదని రోగులు వాపోతున్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో కరెంట్ అంతరాయం ఏర్పడినప్పుడు రోగులు అంథకారంలో ఉక్కపోతతో తీవ్ర అవస్థ పడుతున్నారు. మరోవైపు టెక్నీషియన్ లేనికారణంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్ నిరుపయోగంగా మారింది.
వెక్కిరిస్తున్న వంద పడకల శిలాఫలకం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణానికి రూ.29 కోట్లు కూడా మంజూరు చేసింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు అందుకు శిలాఫలకం వేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఏడుగురు శానిటరీ సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ వైద్య విధాన్ పరిషత్‌కు లేఖ రాసినట్లు సూపరింటెండెంట్ చెప్తున్నా ఆచరణలో మాత్రం అవస్థలు తీరలేదు.
వైద్యుల పోస్టులను భర్తీ చేయాలి
కోదాడలోని 30 పడకల ప్రభుత్వ దవాఖానకు పరిసర ప్రాంతాల నుంచి నిరుపేదలు రోజుకు 350కి పైగా వచ్చేవారు. 16 మంది వైద్యులకు ముగ్గురే సేవలందిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యుల పోస్టులు భర్తీ చేయాలి.
– కుదరవెల్లి బసవయ్య, సామాజిక కార్యకర్త, కోదాడ
పీహెచ్సీలో సరిపడా మందులు లేవు
నియోజకవర్గ వ్యాప్తంగా మూడు నెలలుగా డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి విషజ్వరాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు లభించకపోవడంతో గ్రామాల్లో ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.
– అబుబకర్, మాతానగర్, కోదాడ