తిరుమలగిరి, మార్చి 28 : యాసంగిలో వరికి ప్రత్నామయంగా కూరగాయల పంటలు సాగు చేసిన రైతులు సైతం ఇప్పుడు నీళ్లు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఎండలు విపరీతం అవుతుండడం, భూగర్భ జలాలు అడుగుంటటడంతో తోటలను కాపాడుకోలేకపోతున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిబండతండాలో దాదాపు వంద కుటుంబాల వరకు కూరగాయలు సాగు చేస్తుంటాయి. 365 జాతీయ రహదారికి దగ్గరగా, మున్సిపాలిటీకి ఆనుకుని ఉండడంతో రైతులు నేరుగా అమ్ముకుంటారు. ఇక్కడ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులూ ఉన్నారు. ఈసారి నీటి ఎద్దడి ఉంటుందని అంచనా వేసుకున్న రైతులు 60 ఎకరాల్లో కూరగాయలు చేశారు. మిగతా భూమిలో పత్తి, కంది, వేరుశనగ సాగు చేశారు. వెలిశాల వద్ద ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ద్వారా 69 డీబీఎంలో నీళ్లు ప్రహిస్తే ఈ తండాలో భూగర్భ జలాలకు ఢోకా ఉండదు. బోర్లు, బావులు పుష్కలంగా నీళ్లు అందిస్తాయి. కానీ ఈ యాసంగిలో ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. రెండు వారాల నుంచి బోర్లు కొద్దొగొప్ప కూడా పోయకపోవడంతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయని నెల్లిబండతండా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30 ఎకరాల్లో తోటలు ఎండినట్లు చెప్తున్నారు. చేతికందే దశలో కూరగాయల తోటలు ఎండిపోతుండడంతో మేకలు, పశువుల మేతకు వదిలేయాల్సిన వస్తున్నదని వాపోతున్నారు. ఎకరాకు రూ.70 వేలకు అయ్యిందని వచ్చిందని ఆ పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు.
నేను ఎనిమిదెకరాల్లో టమాట సాగు చేసిన. ఎకరానికి 65 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన. కాత బాగానే వచ్చింది. చెట్టుకు కేజీన్నర టామాటలు కాసినయి. కొంత నిలదొక్కుకుంటా అనుకునే సమయంలో 15 రోజుల నుంచి బోర్లు పోస్తలేవు. తోట మొత్తం ఎండిపోయింది. చేసేదిలేక పశువులు, మేకలను మేపుతున్నాం. చేసిన కష్టం దక్కలేదు. అప్పులే మిగిలినయ్.
నేను రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేసిన. కిందటేడు నుంచి నీళ్లు సరిగ్గ అందకపోవడంతో 40 వేల రూపాయలు పెట్టి బోరు వేయించిన. 20వేలు పెట్టి రెండు ట్యాంకులు కట్టించిన. వాటితోనైనా పైపుల ద్వారా నీళ్లు అందిద్దామంటే బోరు పోస్తలేదు. నీళ్లులేక టమాట పంటంతా ఎండిపోయింది. లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన. ఇలా అవుతుందనుకోలేదు.
లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేసిన. కాల్వకు నీళ్లు రాక బోరు పొయ్యక పంటంతా ఎండిపోయింది. పశువుల మేతకు వదిలేసిన. గతంలో నీళ్లకు బాధ లేకుండే. పంటలు మంచిగ పండించుకున్నాం. ఎకరాకు 30వేల రూపాయలకు పైన మిగిలేవి. ఇప్పుడు అప్పులు మీద పడుతున్నయి. ప్రభుత్వం ఆదుకోవాలి.