యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/గుండాల : తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప నిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడంలేదు.సిబ్బంది వేతనాలు గత ఆరు నెలలుగా పెండింగ్లోనే ఉ న్నాయి. అరకొర వేతనాలతో పనిచేస్తున్నా కనీసం సర్కార్ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోడంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పండుగ పూట సైతం పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 మోడల్ స్కూళ్లు ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏడు స్కూళ్లు ఉన్నాయి. గుండాల, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, పోచంపల్లి, బొమ్మలరామారం, వలిగొండ, తుర్కపల్లి మండలాల్లో పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 200 మందికి పైగా ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఆరు నెలలుగా జీతాలు రావడంలేదు. ఫిబ్రవరి నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదో తేదీనే వేతనాలు చెల్లించేవారని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరివి అరకొర జీతాలే. కనీస వేతనం కూడా లేకుండా అతి తక్కువ జీతాలకే పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, వ్యాయామ ఉపాధ్యాయులు వీరిలో ఉన్నారు. ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. 15 వేలు, రూ. 17వేలు, రూ. 22 వేలు చొప్పును జీతాలు ఇస్తున్నారు. బయట అటెండర్ కంటే తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ రాలేదని, సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.
వేతనాలు అందకపోవడంతో సిబ్బంది పడరాని తిప్పలు పడుతున్నారు. అప్పులు కూడా పుట్టకపోవడంతో అరిగోస తీస్తున్నారు. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అనేక మందికి పూట గడవడమే భారమవుతున్నది. ఇంటి అద్దెలు, నిత్యావసరాలకు డబ్బుల్లేవు. పిల్లల ఫీజులు చెల్లించడంలేదు. ఇంట్లో వృద్ధులు ఉంటే మందులకు కూడా పైసల్లేవు. సకాలంలో నెలనెలా జీతాలు అందితేనే కుటుంబాలను కష్టంగా వెళ్లదీసే కాలంలో.. అసలే వేతనాలు రాకపోవడంతో ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతమే ఆధారమని, నెలల తరబడి పెండింగ్లో పెడితే ఎలా అని వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయోనని నిత్యం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.