యాదగిరిగుట్ట, జూన్ 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంతో స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను అత్యంత వైభవంగా చేపట్టారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పుకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. శివాలయం చెంతన గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 17,93,209 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.