రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. జంగ్ సైరన్ మోగుతున్నది. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరు ఉధృతమైంది. ఉద్యమానికి సబ్బండ వర్గాల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది.
రామన్నపేటలో అదానీ సంస్థ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నది. గతంలో ఇక్కడ డ్రైపోర్టు పేరుతో రైతుల నుంచి కొనుగోలు చేసిన 365 ఎకరాల్లోని 65.6 ఎకరాల్లో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఇది ఏర్పాటుచేస్తే రామన్నపేటతోపాటు వలిగొండ, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లోని పలు గ్రామాలను కాలుష్య కూపాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ ఏర్పాటును ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి..
సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పోరాటం చేస్తున్నారు. ఏకంగా సర్కారుపై తిరుగుబాటు చేస్తున్నారు. అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ రూపొందించారు. పార్టీలతో సంబంధం లేకుండా పర్యావరణ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశారు.
పరిశ్రమ వస్తే జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వేదిక ఆధ్వర్యంలోనే పోరు కొనసాగిస్తున్నారు. రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. మేధావులతో సదస్సులు ఏర్పాటు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. దాంతో రోజురోజుకూ ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతున్నది.
సబ్బండ వర్గాల మద్దతు..
అంబుజా సిమెంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరుకు అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ఉద్యమం ఏ ఒక్కరి కోసమో కాదని, అందరం కలిసిగట్టుగా ముందుకెళ్దామని పోరాటానికి నడుం బిగిస్తున్నాయి. పరిశ్రమతో కులవృత్తులు ఆగమయ్యే పరిస్థితి ఉండడంతో రోజుకో కుల సంఘం ఉద్యమాన్ని భుజానికెత్తుకుంటున్నాయి. ఇటీవల పద్మశాలీలు, ముదిరాజ్, యాదవ్‌లతోపాటు మైనార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు పెద్దఎత్తున చేపట్టిన ధర్నాకు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 23 రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశ్రమను అడ్డుకుంటామని ప్రజలు శపథం చేస్తున్నారు.
కంపెనీ ఏర్పాటును అడ్డుకుంటాం
జనావాసాలకు కూతవేటు దూరంలో ఏర్పాటు చేస్తామంటున్న అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును అడ్డుకొని తీరుతాం. కంపెనీ ఏర్పాటు అయితే జనం జీవచ్ఛాలు కావాల్సిందే. ఈ నెల 23న నిర్వహించే ప్రాజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి నిరసన తెలపాలి.
-మిర్యాల మల్లేశం, రామన్నపేట
జీవాలకు గడ్డి కూడా దొరకదు
రామన్నపేట పరిసరాల్లో సుమారు 10 వేలకు పైగా కుటుంబాలు గొర్లు, మేకలు, పెంచుకుంటూ బతుకుతున్నాయి. సిమెంటు పరిశ్రమ పెడితే దానివల్ల వచ్చే దుమ్ము భూమి మీద పర్చుకొని గడ్డి మొలవదు. జీవాలకు మేయడానికి గడ్డి కూడా దొరకదు. గొర్రెల పెంపకందారుల కుటుంబాలు వీధిన పడుతాయి.
-ఆవుల యాదయ్య, గొర్రెల కాపరి, నీర్నెముల
చేనేత మనగడకు ముప్పు
రామన్నపేట మండలంలో వ్యవసాయం తరువాత ఎక్కువ కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అనేకమందికి చేనేత తప్ప మరో పని తెలియదు. ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే చేనేత వృత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. చేనేతలో అర కట్టడం, రంగులు అద్దడం వంటి ప్రక్రియలు ఆరు బయట చేయాల్సి ఉంటుంది. సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే దుమ్ముతో నూలుకు సరిగ్గా రంగులు అద్దవు. దాంతో వస్ర్తాల నాణ్యత దెబ్బతింటుంది. మార్కెటింగ్ తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
-రాపోలు సత్తయ్య, చేనేత కార్మికుడు, సిరిపురం