హుజూర్నగర్, ఏప్రిల్ 13 : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ యూనియన్ సభ్యులు సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ, కీలక పాత్ర పోషిస్తున్న తమ పట్ల ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల్లో ఉన్న భారీ వ్యత్యాసాలను వెంటనే తొలగించాలన్నారు. ఏపీఎస్ఈబీ రూల్స్ విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం ఆర్టిజన్ల హక్కులను కాపాడాలన్నారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న మాకు తగిన గుర్తింపు గానీ, సరైన వేతనం గానీ లభించడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను గౌరవప్రదంగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసనకు పెద్ద ఎత్తున విద్యుత్ కార్మికులు, వివిధ విభాగాల యూనియన్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటకృష్ణయ్య, రీజనల్ ప్రెసిడెంట్ ఎన్,బాలకృష్ణ, శంకర్, వేణు, వీరభద్రం పాల్గొన్నారు.