సూర్యాపేట, సెప్టెంబర్ 2 : నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. నిమజ్జనోత్సవంపై మంగళవారం ఆయన జిల్లా, డివిజన్ అధికారులతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. నిమజ్జనం జరిగే సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో ఆర్డీవోల కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. అన్ని చోట్ల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎవరూ నీళ్లలో పడిపోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలి, హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేయాలన్నారు.
సూర్యాపేటలో సద్దుల చెరువు, రత్నాపురం, కోదాడలో పెద్ద చెరువు, హూజూర్నగర్లో మఠంపల్లి, చింతలపాలెం ఘాట్, నేరేడుచర్ల, పాలకీడు ఘాట్ల వద్ద నిమజ్జనం జరిగే అవకాశం ఉందని ఈ నెల 4,5, 6 తేదీల్లో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు వస్తాయని ఆర్డీవోలు జిల్లా కలెక్టర్కు వివరించగా స్పష్టమైన తేదీలను సంబంధిత ఆర్గనైజేషన్ ద్వారా సేకరించి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలన్నారు. రూట్ మ్యాప్ తయారు చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. నిమజ్జనం రోజున బెల్టుషాపులు మూసివేసి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ నరసిం హ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పోలీసు అధికారులు బందోబస్తుతోపాటు నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో మంగళవారం నిమజ్జనం చేసే సద్దుల చెరువును జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సూర్యాపేట పరిధిలోని ఆర్డీవో, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ అన్ని శాఖల వారితో సమన్వ యం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32 వందల విగ్రహాలు ఉన్నాయని వీటిని నిమజ్జనం చేసేందుకు 1500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, మత్స్య, ఇరిగేషన్, ఫైర్ అధికారులు పాల్గొన్నారు.