నూతనకల్, నవంబర్ 27 : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆదేశించారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనం, మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొదటి విడుత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పి కె.నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతనకల్ ఎంఆర్సీ భవనంలో నూతనకల్, వెంకేపళ్లి, యెడవల్లి, చిల్పకుంట్ల గ్రామ పంచాయతీ సర్పంచులకు, వార్డు సభ్యులకు నామినేషన్ సేకరించడం జరుగుతుందన్నారు. అలాగే మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మిర్యాల, అల్గునూరు, లింగంపల్లి, మాచనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని, అలాగే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే ఆపేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి తప్పులకు ఆష్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా స్వీకరించిన నామినేషన్ పత్రాలను వేర్వేరుగా భద్రపరచాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓలు సునీత, మహ్మద్ హసీం ఉన్నారు.