మునుగోడు, ఏప్రిల్ 29 : మన ఊరి పిల్లల్ని- మన బడిలోనే చేర్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పిలివెల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు పెరిక నరసింహ, కాటేపల్లి లక్ష్మి, నరసయ్య, గేర నరసింహ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మన ఊరి బడిలోనే పిల్లల్ని చేర్పించాలని కోరారు.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్ బోధన, కంప్యూటర్ విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్, షూస్ అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోవాలన్నారు.
ఇంగ్లీష్ మీడియంలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉచితంగా బోధిస్తున్నామని, గ్రామస్తులంతా ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా మన ఊరి బడిలోనే తమ పిల్లల్ని చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంప్‌ను పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు, వేసవి సెలవులు అయినప్పటికీ ప్రతి రోజు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, గణితం, ఫిజిక్స్ మొదలైన వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.