రామగిరి, మే 30 : ఏఐ ప్రొఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన నల్లగొండ ఐటీ టవర్‌లో బీటెక్ ప్రవేశాలుగోరే విద్యార్థులకు ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు సంస్థ ఫౌండర్, చైర్మన్ సాందీప్ కోణం తెలిపారు. ఇప్పటికే అబ్రిడ్జ్, కోణం ఫౌండేషన్ సంస్థలను నెలకొల్పి సాంకేతిక రంగంలో విస్తృతమైన సేవలు అందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందినట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలోనే ప్రప్రథమంగా ‘ఏఐ ఆధారిత బీటెక్ ఎకోసిస్టమ్’ తో ఏఐ ప్రోఫ్ కంపెనీని నెలకొల్పి నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏఐ బీటెక్ కు శ్రీకారం చుట్టి ఇంజినీరింగ్ విద్యలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నామని తెలిపారు. లక్షలు వ్యయం చేసి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసినా సరే ఉద్యోగాలు రాని పరిస్థితికి చెక్ పెట్టి బీటెక్ మొదటి సంవత్సరం నుంచే ప్లేస్మెంట్ శిక్షణ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఏఐ ప్రోఫ్ ఆవిర్భవించిందని తెలిపారు.
నల్లగొండ స్థానికుడిగా సొంత నేలపై మమకారంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలన్న సంకల్పంతో ఈ ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ను నిర్వహిస్తున్నట్లు సాందీప్ కోణం తెలిపారు. తమ సంస్థకు జేఎన్టీయూతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కూడా జరిగిందని తెలిపారు. సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నందున ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తొలి దశ అడ్మిషన్లలో ముఖ్యంగా నల్లగొండ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్ షిప్/ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న ఏఐ ఆధారిత బీటెక్ కోర్సుల అడ్మిషన్లకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.