నకిరేకల్, జూన్ 03 : చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గస్థాయి విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు వరి, పెసర నాణ్యమైన విత్తనాల కిట్లను ఎమ్మెల్యే వీరేశం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనంతోనే రైతుకు లాభం చేకూరుతుందన్నారు. పంటలకు ఎరువుల మోతాదును తగ్గించే విధంగా వ్యవసాయ ప్రణాళిక పద్ధతిలో సూచనలను రైతులు పాటించాలన్నారు.
భూసారం దెబ్బతినడంతో కంపోస్ట్ ఎరువుల విధానంతో చేసే వ్యవసాయమే ఉత్తమమన్నారు. అనంతరం పంపిణీ చేస్తున్న వరి(కెఎన్ఎం 1638), పెసర(ఎంజిజి 385) సాగు పద్ధతుల గురించి రైతులకు పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు నాగులవంచ వెంకటేశ్వరరావు, నంద్యాల భిక్షంరెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చౌగోని రజితశ్రీనివాస్, వ్యవసాయ సహాయ సంచాలకులు ఎండి జానిమియా, పిజెటిఎస్ఎయు శాస్త్రవేత్తలు కెవి రామాంజనేయులు, శంకర్, విజయలక్షీ పాల్గొన్నారు.