– ఒకే 11 కేవీపై 10కి పైగా ఏర్పాటు
– రైతులకు పొంచిఉన్న ప్రమాదం
– విద్యుదాఘాతంతో తరచుగా మూగజీవాలు మృతి
పెద్దవూర, జూన్ 07 : పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివారులో వాగు పక్కన ఒకే దగ్గర పదికి పైగా ట్రాన్స్ఫార్మర్లను గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఒకేచోట ఉండడం, కనీసం వాటికి కంచె కూడా ఏర్పాటు చేయకపోవడంతో పశుగ్రాసానికి, వాగులో నీళ్లు తాడానికి వెళ్లే మూగజీవాలు తరచుగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందుతున్నాయి. తరుచు ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పశుగ్రాసానికి వెళ్లిన బర్రెలు, మేకలు అక్కడ ఉన్న ఎర్త్ వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను తాకి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి.
ఒకే 11 కేవీ లైన్‌పై ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్కు ఇబ్బంది ఏర్పడితే రైతులు తమ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లి మరమ్మతులు చేస్తున్న సమయంలో అక్కడ పక్కనే ఉన్న వేరే ట్రాన్స్ఫార్మర్లు ఆన్‌లో ఉండడం వల్ల విద్యుత్ ప్రవహించి రైతులు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా మూగ జీవాలు మృతిచెందకుండా, రైతులకు ప్రమాదం ఏర్పడకుండా విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్ఫార్మర్లను తొలగించడమా లేదా వాటి చుట్టు కంచె ఏర్పాటు వేసి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.