యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నగారా మోగింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు తెర లేచింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో జిల్లాలో సోమవారం నుంచి మున్సిపాలిటీలు మినహా గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో ఆలేరు, తుంగతుర్తి, రెండో దశలో భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు.
మొదటి దశలో 10 మండలాలు..
జిల్లాలో 17 మండలాలు ఉన్నా యి. 7 ఎంపీపీలు, జెడ్పీటీలు, 178 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 1001 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా చోట్ల రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, తుంగతుర్తి మండలంలోని రెండింటిని కలుపుకొని మొత్తం 10 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. అడ్డగూడూరు, మోత్కూరు, ఆలేరు, ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, గుండాల, మోటకొండూరు, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 84 ఎంపీటీసీలకు గాను 24,5810 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రెండో దశలో ఏడు మండలాలు..
రెండో దశలో భువనగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మునుగోడు నియోజకవర్గంలోని రెండు, నకిరేకల్ నియోజకవర్గంలోని ఒక మండలంలో ఎన్నికలు నిర్వహిస్తారు. వీటిలో పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాలు ఉన్నాయి. 94 ఎంపీటీసీలకు గాను 2,86,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు ఎన్నికల సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 3310 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నా యి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలుపుకొని 1934 బాక్సులు అవసరం పడతాయి.
ఎన్నికల సిబ్బంది సిద్ధం..
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయింది. రెండు దశల ఎన్నికలకు 1202 మంది ప్రిసైడింగ్ అధికారులు, 5545 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల బృందాలను నియమించారు. ఇప్పటికే వీరికి పలు దఫాలుగా శిక్షణ కూడా పూర్తి చేశారు. మరోవైపు జిల్లాలో 220 సమస్యాత్మక, 290 సున్నితమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎన్నికల కోడ్‌పై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వ సదుపాయాలు, సిబ్బందిని వాడుకోరాదు. అతిథి గృహాలు, ఇతర సర్కారు భవనాలను ప్రభుత ్వం తన ఆధీనంలోకి తీసుకుంటోంది.