రామగిరి, అక్టోబర్ 16 : జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగినుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ గత నెల 30న నోటిపికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, నల్లగొండ వాసి అల్గుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈసారి కూడా ఆయన పేరునే ఆ సంఘం ఖరారు చేసింది. గత ఎన్నికల్లో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 20, 888 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీఆర్టీయూ, ఎస్టీయూ, టీపీయూఎస్తోపాటు మిగతా సంఘాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఆయా సంఘాల్లోని ఆశావహులు మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 30న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేయడంతోపాటు.. నిబంధనల మేరకు అర్హులైన టీచర్లు (పాఠశాల విద్య, ఉన్నత విద్య) నవంబర్ 6లోగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దాంతో ప్రతి ఉపాధ్యాయుడు(టీచర్లు, అధ్యాపకులు) విధిగా తమ ఓటును కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి హైస్కూల్లో పని చేసే ఉపాధ్యాయులతోపాటు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ, పాలిటెక్నిక్, ఐఐటీల్లో అర్హులైన వారంతా ఓటు హక్కు కోసం ఎన్నికల కమిషన్ సూచించిన వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. మరోవైపు జిల్లా అధికారుల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మూడే్ంలడపాటు వరుసగా పని చేసేవారికీ అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై చైతన్యం చేస్తుండడంతోనూ ఓటర్ల సంఖ్య పెరిగే చాన్స్ కనిపిస్తున్నది.
ఉపాధ్యాయ సంఘాల సన్నాహాలు
టీఎస్ యూటీఎఫ్ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆ సం ఘం నాయకులు సన్నహక సమావేశాలు, సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎస్టీయూతోపాటు పలు సంఘాల సభ్యత్వ నమోదు చేస్తున్నాయి. పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర కార్యవర్గ నియమకాలు పూర్తి చేయడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు పీఆర్టీయూ మాజీ ఎమెల్సీ పూల రవీందర్ ఈసారి పోటీ చేస్తారని వినిపిస్తుండగా, ఆ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి పేరు తెరపైకి వస్తున్నది. టీపీయూఎస్ నుంచి సూర్యాపేట జిల్లాకు చెందిన సాయిరెడ్డి బరిలో ఉంటారని
చెప్తున్నారు.
డిసెంబర్ 30న టీచర్స్ ఎమ్మెల్సీ తుది ఓటరు జాబితా
భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 16: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆయన సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి రివిజన్ షెడ్యూల్ విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చే నవంబరు 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ప్రకటించినట్లు చెప్పారు.
నవంబరు 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి, సవరణపై దరఖాస్తులను డిసెంబరు 9 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 25 వరకు వాటిని పరిషరించి, 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. భువనగిరి డివిజన్లో 12, చౌటుప్పల్ డివిజన్లో 5 పోలింగ్ కేంద్రాలతోపాటు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 17 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు బట్టు రామచంద్రయ్య, బట్టుపల్లి అనురాధ, ఆబోతుల కిరణ్‌కుమార్, రత్నపురం బలరాం
పాల్గొన్నారు.