పెన్పహాడ్, జూన్ 26 : పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కుల వెంకన్న (65) అనే వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తెలిపారు. జక్కుల వెంకన్న గ్రామంలోని పెద్ద చెరువుకు మత్స్య కార్మికుడిగా పని చూసుకునేవాడు. మే 14వ తేదీన విధుల్లో భాగంగా చేపలకు మేత వేసి వాటిని పరిశీలించడానికి ఆయన పడవపై వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు పడవపై నుండి చెరువులో పడిపోయాడు. ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరి ఇంటికి వచ్చినప్పటికీ, ఎడమవైపు పక్కటెముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మొదట సూర్యాపేటలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నా నొప్పి తగ్గకపోవడంతో, కొదాడ హాస్పిటల్కు, ఆపై సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరు రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 25న ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు. వెంకన్న కుమారుడు జక్కుల భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు.