చివ్వెంల,మే 2: ‘మేం ఏఐసీసీ సభ్యడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మనుషులం. మమ్మల్ని ఎవరూ ఏమీచెయ్యలేరు’, అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవి గూడెంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమరగాని అబ్బులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంగల రామలింగయ్య తమ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొంగల రాములు,లచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా భూమిని అమ్ముకోనివ్వండి, లేదా చావడానికి అవకాశం ఇవ్వండి’, అంటూ పురుగుల మందు డబ్బాతో వారు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సంఘటన గ్రామంలో శనివారం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బండమీది చందుపట్ల రెవెన్యూ శివారులోని 264 సర్వేనంంబర్లో తమకు, తమ కుమారుడికి 1.06 ఎకరాల భూమి ఉందన్నారు అనారోగ్యం, అప్పుల కారణంగా భూమిని విక్రయించుదామనుకుంటే అమరగాని అబ్బులు, కొంగల రామలింగయ్య మరి కొంతమంది వ్యక్తులు తమను ఇబ్బందులు పెడుతున్నారని కన్నీటి పర్యంతమమ్యారు. వారం రోజుల క్రితమే షుగర్ వ్యాధి కారణంగా తన కాలి వేలు తొలగించారని, తన భార్య పక్షవాతంతో ఇబ్బందులు పడుతోందని కొంగల రాములు పేర్కొన్నారు.
గత నెల 6న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, 20న జిల్లా ఎస్పీ నర్సింహకు ఇచ్చిన ఫిర్యాదులో తమకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని మా అవసరాల నిమిత్తం అమ్ముకుంటుంటే అడ్డుపడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటుందని రాములు పేర్కొన్నారు. వారిని ప్రశ్నిస్తే మాకు కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అండదండలు ఉన్నాయని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ నర్సింహకు విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వోత్తం రెడ్డి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.