– రావెళ్ల సీతారామయ్య
కోదాడ, జూన్ 15 : సమాజంలో రోజురోజుకూ వయోవృద్ధులపై జరుగుతున్న దాడులు, వారి పట్ల చూపిస్తున్న నిరాదరణ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమాఖ్య కార్యవర్గ సభ్యుడు రావేళ్ల సీతారామయ్య అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల నిరాదరణ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డం నరసయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ సూర్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డలే తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల ఆదరణ కరువై ఎంతోమంది వృద్ధులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధుల హక్కులను కాపాడడంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లెంపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, బండారు రంగారావు, జానయ్య, పొట్ట జగన్మోహన్ రావు, ఓరుగంటి సత్యనారాయణ, వీరబాబు, రంగారావు, బసవయ్య పాల్గొన్నారు.