నీలగిరి, ఆగస్టు 30 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈ కేవైసీ, టీహెచ్ఆర్ (Take Home Ration)లో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని నల్లగొండ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. శనివారం నల్లగొండ ప్రాజెక్ట్ పరిధిలోని చర్లపల్లి సెక్టార్ అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రభుత్వం ఈ కేవైసీ టీహెచ్ఆర్ ప్రకారంగానే నిధులు విడుదల చేస్తామని ప్రకటించిందని, కావునా లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీలు 96 శాతం ఉందని దాన్ని రేపటిలోగా నూరు శాతం చేయాలని అలాగే టీహెచ్ఆర్ లు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని రేపటిలోగా 90 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు. ఆన్లైన్ పూర్తి చేసిన వారికి మాత్రమే పౌష్టికాహారం అందించేందుకు వీలుంటుందన్నారు. టీచర్లు అధికారులు సమన్వయంతో పని చేస్తూ వాటిని నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. చిన్నారులంతా ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. అంగన్వాడీ సర్వే జనాభా వెయ్యి మందికి పైగా ఉంటే సర్వేలోని చిన్నారులందరినీ నమోదు చేసి 20 మందికి తగ్గకుండా అంగన్వాడీ స్కూల్ కి వచ్చేలా చూడాలన్నారు. ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లు సమయానికి తీస్తూ సిబ్బంది యూనిఫామ్ ధరించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున అద్దె భవనాలు ఏమైనా శిథిలావస్థలో ఉంటే వెంటనే వాటిని మార్చాలని, కరెంట్ ఇతర ప్రమాదం కలిగే సెంటర్లు ఉంటే వాటిని యజమానులతో చెప్పి మరమ్మతులు చేయించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీడీపీఓ తూముల నిర్మల, సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్లు కుర్షిదాబేగం, సుశీల, విజయ, రజిత, మంగ, సావిత్రమ్మ, పకృతాంబ, సునంద, పుష్పమ్మ, శంకరమ్మ, లావణ్య, లక్షమ్మ, శిరిష, అనిత పాల్గొన్నారు.