పాలకవీడు, మార్చి 13 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అతివేగంగా వచ్చిన టాంకర్ లారీ గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లడంతో ఎనిమిది జీవాలు మృతిచెందాయి. మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అంజిరెడ్డి కొంతకాలంగా గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేత లేని కారణంగా పాలకవీడు మండల కేంద్రంలోని ఒక బీడు పొలం తీసుకుని జీవాలను మేపేందుకు తోలుకపోతున్నాడు.
ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఒక్కసారిగా గొర్రెల మందపై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు చనిపోగా, మరో మూడు జీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపుగా రూ.లక్ష నష్టం వాటిల్లందని కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.