సూర్యాపేట టౌన్, నవంబర్ 22 : రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 65వ జాతీయ రహదారి కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్ జంక్షన్ ను పరిశీలించి మాట్లాడారు. పోలీసులు రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు గ్రామీణ రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. దీనిలో భాగంగా వాహనాల వేగం, ప్రజల రాకపోకలు, రోడ్డు క్రాసింగ్, ఇంజినీరింగ్ లోపాలు, లైటింగ్ ఏర్పాట్లు, బారికేడ్ ల ఏర్పాటు మొదలగు అంశాలను పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రోడ్డు ప్రమాద స్థలాల వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉంటూ రోడ్లు దాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.