మునుగోడు, మే 02 : స్వచ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ సమస్యలపై పంచాయతీ కార్యదర్శులు, నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి మునుగోడులోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయి, మురుగు కాల్వల నిర్వహణ సరిగా ఉండకపోవడం వల్ల దోమలు ఎక్కువై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిపారు. పల్లెలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. మనిషి ఎక్కువగా అనారోగ్యం పాలు కావడానికి కారణం త్రాగునీరు సరిగా లేకపోవడం అని కావునా త్రాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై నియోజకవర్గ ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీలో చేపట్టే అక్రమ నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.
మునుగోడులో బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రతి ఒక్కరం ఏ విధంగానైతే ఉద్యమం చేసి వాటిని నిర్మూలించామో అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలనకూ ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై పనిచేయాలని కోరారు. గ్రామ పంచాయతీ విస్తీర్ణాన్ని బట్టి ఆ విస్తీర్ణంలో 10 శాతం చెట్లను పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డీపీఓలు, డీఎల్పీఓలు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Munugode : ‘స్వచ్ఛ మునుగోడు’కు కృషి చేయాలి : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి