నిడమనూరు, జూన్ 18 : ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముకుందాపురం, నారమ్మగూడెం, రేగులగడ్డ, తుమ్మడం, వల్లభాపురం, నిడమనూరు, వేంపాడు, వెనిగండ్ల, మారుపాక, ఊట్కూరు, ముప్పారం, గుంటిపల్లి, బంకాపురం గ్రామాల్లో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల నిల్వల పెరుగుదల పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాల నిల్వల పెరుగుదలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. భూగర్భ జలాల నిల్వల పెంపు పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టి మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు గంగుల లింగయ్య, నర్సింహ్మాచారి, సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్లు సైదులు, వెంకటరత్నం, శ్రీనివాస్, నర్సింహ్మారావు, సత్యవాణి, సైదులు, పాల్గొన్నారు.