నల్లగొండ సిటీ, జూలై 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ కనగల్లు మండల కార్యదర్శి ఇరుగంటి హరిచంద్ అన్నారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ మండలంలో విజయవంతమైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలన్నారు.
హాస్టల్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని, అద్దె భవనంలో నడుస్తున్న గురుకుల హాస్టల్స్ భవనాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అక్రం, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆకారపు కుమార్, రఫీ, నాగరాజు, హేమంత్, ధనంజయ, శివ పాల్గొన్నారు.