పెన్పహాడ్, మే 19 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ధూపహాడ్ గ్రామానికి చెందిన ఎడవెల్లి మధుబాబు దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తున్న పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు. ఎడవెల్లి మధుబాబు గత కొన్ని సంవత్సరాలుగా దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల కోసం, అలాగే పేదల సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తున్నారు. ఆయన సేవలను, కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది. అవార్డును డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు సికింద్రాబాద్ పారడైజ్ లోని క్లాసిక్ గార్డెన్లో ఎడవెల్లి మధుబాబుకు అందించారు. అవార్డు మధుబాబు పోరాటానికి ఒక గుర్తింపు అని పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.