రామగిరి, డిసెంబర్ 27 : కక్షిదారులు రాజీకాదగిన కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 30న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే లాయర్లు, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
లోక్ అదాలత్‌లో కుటుంబ తగాదాలు, క్రిమినల్, భూ సమస్యలు, వాహన ప్రమాదాలు, రుణాలు తదితర అంశాలకు సంబంధించిన కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్‌లో తీర్పు వస్తే కక్షిదారుల కోర్టు ఫీజు తిరిగి ఇవ్వడంతోపాటు తిరిగి ఆ కేసు అప్పీలుకు అవకాశం ఉండదని, మరోవైపు ఆర్థికభారంతోపాటు సమయం సద్వినియోగం అవుతుందని వెల్లడించారు.
అలాగే రాష్ట్ర ఫ్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ కల్పిస్తున్నందున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని బకాయిలు చెల్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,29,131 వాహన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డీవీఆర్ తేజోకార్తీక్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి పాల్గొన్నారు.