రామగిరి, జూన్ 17: పీఈటీల అప్గ్రెడేషన్ (స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు)లో నకిలీ సర్టిఫికెట్లపై విచారణ కొనసాగుతున్నది. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ నెల 16న ప్రచురితమైన ‘పీఈటీల పదోన్నతుల్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం’ వార్తకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నకిలీలుగా గుర్తించిన 12 మంది ఉపాధ్యాయులను ప్రత్యేకంగా డీఈఓ కార్యాలయానికి పిలిచారు.
వారికి సంబంధించిన సర్టిఫికెట్స్, ఇన్ సర్వీసులో శిక్షణ పూర్తి చేసిన కాలం, యూనివర్సిటీ, కళాశాలల అంశాలను పరిశీలిస్తున్నారు. 12 మందిలో 11మంది పీఈటీలు శిక్షణ పూర్తి చేయగా వారు ఏకాలంలో ఇటు పాఠశాలకు, మరో వైపు కళాశాలలో తరగతులకు హాజరైనట్లు గుర్తించినట్లు సమాచారం. చింతపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ తాను సర్వీసు పుస్తకంతోపాటు నకిలీ బీపీఈడీ సర్టిఫికెట్ చూపించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి ద్వారా తెలిసింది.
‘పీఈటీల పదోన్నతుల్లో నకిలీ సర్టిఫికెట్స్, సర్వీస్ పుస్తకం సమర్పించిన వారిని గుర్తించాం. వీరిలో ఒక్కరు తప్ప మిగిలిన ఉపాధ్యాయులు ఇన్ సర్వీసులు పూర్తి చేసి, వ్యాయామ వి ద్య శిక్షణలో సెలవులు పెట్టకుండా ఏకాలంలో శిక్షణకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. మరి కొందరు సెలవులు పెట్టినప్పటికీ శిక్షణ కాలం సంవత్సరం కోర్సులో ఆ కళాశాలల పని చేసిన కాలం, పాఠశాలలో వారి హాజరు విషయంలో తేడాలున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ జరుగుతున్నది. నిర్ధారణ కమిటీ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ఆ తర్వాత ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం’.