గుర్రంపోడ్, ఫిబ్రవరి 25 : విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసిన గుర్రంపోడు తాసీల్దార్ జి.కిరణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిరణ్ కుమార్ విన్నపం మేరకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవు మంజూరు చేశారు. జనవరి 17న విధుల్లో చేరాల్సి ఉండగా, సెలవును ఆ నెల 31 వరకు పొడిగించారు. తిరిగి ఫిబ్రవరి ఒకటి నుంచి 28 వరకు సెలవును పొడిగిస్తూ దరఖాస్తు పెట్టారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారుల ఎంపికతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ సెలవు మంజూరు చేయలేదు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని సూచించినా విధులకు హాజరు కాలేదు. దీనిపై వివరణ ఇవ్వాలని కిరణ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసుకు స్పందించకపోవడం, విధుల్లో చేరకపోవడం వల్ల ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో తాసీల్దార్ జి.కిరణ్‌కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, సస్పెన్షన్ కాలంలో సెలవులో ఉన్న తాసీల్దార్ కిరణ్ కుమార్ ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు.