కట్టంగూర్, ఆగస్టు 05 : సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని విమర్శించే స్థాయి గొర్రెలు, మేకల పెంపంకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలిపించిన ఘనత జగదీశ్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగదీశ్ రెడ్డితో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై బాలరాజు చేసిన వ్యాఖలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పెద్ద నాయకుడిపై విమర్శలు చేస్తే దిగ్గజాన్ని అయిపోతాననే భ్రమల్లో ఉంటే మానుకోవాలని హితవు పలికారు. తనకు రాజకీయ భిక్షపెట్టి, కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఇప్పించిన జగదీశ్ రెడ్డినే విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు. తాను పార్టీ మారితే బీఆర్ఎస్ కు జరిగే నష్టమేమి లేదన్నారు. బాలరాజు ఇప్పటికైనా నీ స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తగిన బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేకల రమేశ్, అనంతుల సతీశ్, చిట్టిమల్ల నర్సింహ్మ, నిమ్మనగోటి శివ, చిర్రబోయిన నాగరాజు పాల్గొన్నారు.