రామగిరి, సెప్టెంబర్ 30: డీఎస్సీ 2024 పరీక్షల ఫలితాలను సోమవారం విద్యాశాఖ, ప్రభుత్వం విడుదల చేశాయి. తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో జూలై, ఆగస్టు 2024లో పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు విడుదల సమయంలో అభ్యర్థులు ఉత్కంఠగా ర్యాంకులను చూసుకున్నారు. సోమవారం మధ్యాహ్నమే ఫలితాలు విడుదలైనా, అధికారిక వెబ్సైట్ సర్వర్ పని చేయకపోవడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఈసారి జిల్లాల వారీగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని సబ్జెక్టుల వారీగా వేర్వేరుగా ర్యాంకులు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 1,268 పోస్టులు భర్తీ కానుండగా.. వాటిలో నల్లగొండ జిల్లాలో 605, సూర్యాపేటలో 386, యాదాద్రి భువనగిరిలో 277 ఉన్నాయి.
ఉమ్మడి జిల్లా పరిశీలకుడిగా రమణకుమార్
డీఎస్సీ 2024 సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిశీలకులుగా టీఆర్ఈఎస్ఐ కార్యదర్శి, టెక్స్‌బుక్స్ డైరెక్టర్ సీహెచ్ రమణకుమార్‌ను ఫ్రభుత్వం నియమించింది. సర్టిఫికెట్ పరిశీలన సవ్యంగా సాగేలా ఈయన పర్యవేక్షించనున్నారు. సూర్యాపేట జిల్లా అభ్యర్థులకు సంబంధించి వెరిఫికేషన్ సూర్యాపేట కలెక్టరేట్లోని రెండో అంతస్తు రూమ్ నెంబర్ 26లో ఉంటుందని డీఈఓ అశోక్ తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల వెరిఫికేషన్ భువనగిరిలోని వెన్నెల కళాశాల ఉంటుందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
అభ్యర్థులకు డైట్లో సర్టిఫికెట్ పరిశీలన
డీఎస్సీ 2024 ఫలితాలల్లో 1:3లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం ఈ నెల 5 వరకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డులోని డైట్లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల మొబైల్, మెయిల్‌కు పంపిన సమాచారం ఆధారంగా సబ్జెక్టు వారీగా జాబితాలను https://tgdsc. aptonline.in/tgdscలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటంల నుంచి సాయంత్రం ఐదింటి వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేస్తారని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌తో పరిశీలన సమయంలో కౌంటర్లో అందించాలని సూచించారు.
మహిళా అభ్యర్థుల్లో మొదటి ర్యాంకు
గరిడేపల్లి : మండలంలోరి మర్రికుంట గ్రామానికి చెందిన యర్రంశెట్టి శృతి డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా స్థాయిలో 12వ ర్యాంకు, మహిళల్లో మొదటి ర్యాంకు సాధించారు. రెండు నెలల క్రితం గురుకుల టీజీటీలో సోషల్, తెలుగు విభాగంలో రెండు ఉద్యోగాలు ,కేజీబీవీలో సోషల్ టీచర్‌గా ఒక ఉద్యోగం సాధించి ప్రస్తుతం చౌటప్పల్ గురుకుల పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
రెండో ర్యాంకు సాధించిన జ్యోతి
నేరేడుచర్ల : మండలంలోని కల్లూరు గ్రామానికి కొండా జ్యోతి గణితం స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె సర్వేల్ గురుకులలో టీజీటీగా పని చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4లో 1:3 ఎంపికయ్యారు.
జీవశాస్త్రంలో 3 ర్యాంకు సాధించిన రాఘవేంద్ర
నార్కట్‌పల్లికి చెందిన పానుగంటి రాఘవేంద్ర స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం విభాగంలో 3వ ర్యాంకు సాధించారు. ఈయన నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో చదవడంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు.