సూర్యాపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఇంచు భూమి వదలకుండా రైతులు వరి పండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి నీళ్ల కోసం అరిగోస తీస్తున్నారు. ఈ యాసంగి వరి నాట్లు వేసిన 20 రోజుల నుంచే ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో నీళ్లు రావడం లేదని, నాటేసిన వరి ఆదిలోనే ఎండిపోతుందని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద సూర్యాపేట జిల్లాలో 2.95 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉండగా, నీళ్లు రావనే అనుమానంతో 2.50 లక్షల్లో నాట్లు పడ్డాయి.
చాలాచోట్ల వానకాలంలో కురిసిన వర్షాలతో బావులు, బోర్లలో నీళ్లు ఉండడంతో నాట్లు వేసినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు అందకపోవచ్చని ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. గతంలో కాళేశ్వరం పంపుల నుంచి వచ్చే నీళ్ల సపోర్ట్‌తోనే పంట చేతికి వచ్చే వరకు నీటిని ఇవ్వగలిగామని, ప్రస్తుతం నీటి నిల్వలు తక్కువ ఉన్నందున పూర్తిస్థాయిలో ఇవ్వడం కష్టమని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ఈ యాసంగిలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద 50 శాతం వరి ఎండిపోతే ప్రమాదం కనిపిస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో కాల్వల ద్వారా నేరుగా నీళ్లు పారేది 2.50 లక్షల ఎకరాలు ఉండగా, ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటల కింద మరో 45వేలు ఎకరాలు కలిపి మొత్తం 2.95 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2017 యాసంగి సీజన్లో సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో కేవలం 17,500 ఎకరాల్లో వరి పండగా, 2018 నుంచి కాళేశ్వరం జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు యాసంగి సీజన్లో వంద శాతం వరి పండించారు. గత ఎన్నికల్లో అలివికాని హామీలు ఇచ్చి, కేసీఆర్‌ను మించి ఏదో చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతన్నల దుస్థితి దయనీయంగా మారింది.
సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలోని కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుంటిసాకులతో చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో గత యాసంగి సీజన్లో జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయాయి. దాంతో దాదాపు ఏడేండ్ల తరువాత ప్రభుత్వంపై రైతన్నలు ఆందోళనలు, ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి నిరసనలు పునరావృతం అయ్యాయి. ప్రస్తుతం యాసంగి నాట్లు 20 రోజుల నుంచి 45 రోజులు పూర్తి చేసుకోగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో నీళ్లు రాక నాటేసిన వరి ఎండిపోతున్నదని నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టింపులు మాని కాళేశ్వరం పంపులను ఆన్ చేసి ప్రస్తుతం ఉన్న ఎస్ఆర్ఎస్పీ జలాలకు సపోర్ట్ ఇవ్వకపోతే జిల్లాలో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎస్ఆర్ఎస్పీలో నీటి నిలువ తక్కువ ఉండగా ఇప్పటికే జిల్లాకు 1,200 క్యూసెక్కులకు మించకుండా ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో నీటి ప్రవాహం మరింత పడిపోతుందని ఇరిగేషన్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ప్రతి మండలంలో దాదాపు 5 శాతం పంటలు పూర్తిగా ఎండిపోగా మరో 10 శాతానికిపైనే ఇప్పుడిప్పుడే ఎర్రబారుతున్నాయి. వారం రోజుల నుంచి ఎండలు ముదురుతుండడం, కాల్వల్లో నీటి ప్రవాహం తగ్గుతుండడం పట్ల ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి 50 శాతానికి పైనే వరి పైర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. వరి పంటకు నీళ్లివ్వలేని పరిస్థితిని ముందస్తుగానే గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి ఇతర పంటలు వేయాలని రైతులను సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నీటి నిల్వల ఆధారంగా కేసీఆర్ నియమించిన ఏఈఓలు గ్రామాల్లోనే ఉన్నందున పంటల మార్పిడి చేపట్టడం, వరి వేస్తే నీరందదని ప్రచారం చేస్తే రైతులకు కొంత నష్టం తప్పేది. ఇప్పటికైనా ప్రభుత్వం కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నీటిని విడుదల చేస్తే నాటేసిన వరి చేతికి అందుతుంది.
ఈ యాసంగి కోసం దుక్కులు దున్ని నాట్లు వేస్తున్న రైతాంగం తొలి దశలోనే నీళ్ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఎస్ఆర్ఎస్పీ కాల్వల నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వారంపాటు నీటిని విడుదల చేస్తుండగా సగం పొలాలకు కూడా చేరుకోవడం లేదు. వారం పాటు నీటిని విడుదల చేయడం, అది కూడా గత బీఆర్ఎస్ హయాంలో 1,800 క్యూసెక్కులు రాగా, ప్రస్తుతం 1,200కి మించి ఇవ్వడం లేదు. దాంతో పారిన చోటే నీళ్లు పారుతున్నాయి తప్ప వెనుక భూములకు అందడం లేదు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్, కోదాడ నియోజకవర్గం పరిధిలోని నడిగూడెం, మునగాల మండలాల్లో దాదాపు 35 శాతం వరకు కాల్వల్లో నీళ్లు పారడం లేదు. ఇప్పటికే వేసిన వరి ఎండిపోతూ మేకలు, పశువులకు మేత అవుతున్నది. కాల్వల్లో నీళ్లు రావడం లేదని, వేసిన నాట్లు ఎండిపోతున్నాయని కాల్వలు, ఎండిపోతున్న పైర్ల వద్ద, రోడ్లపైన రైతులు ధర్నాలు చేస్తున్నారు.
నాకు దుబ్బతండ గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాల్వ కింద నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఐదారేండ్లుగా వానకాలం, యాసంగి సీజన్లో నీళ్లు ఇవ్వడంతో మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేశాను. ఒక్క సీజన్లో కూడా ఎండకుండా పంట చేతికొచ్చింది. గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీళ్ళు ఇచ్చారు. దాంతోపాటు చెరువులు, కుంటలు నింపడంతో సమస్య ఉండేది కాదు. ఇప్పుడు రెండు ఎకరాలే నాటు పెట్టినా, నీళ్లు చాలక పొలం ఎండిపోతున్నది.
– భూక్యా రావూజీ, రైతు, మహ్మదాపురం ఆవాసం లాల్‌సింగ్‌తండా, పెన్‌పహాడ్