రాజాపేట, సెప్టెంబర్ 3 : బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాపేట మండలంలోని బూర్గుపల్లిలో116 నివాస గృహలు, 554 మంది జనాభా కల్గి ఉన్న పల్లెకు గత పదిహేను రోజులుగా తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు.
గ్రామానికి తాగునీరు అందించేందుకు పుష్కలంగా నీళ్ల బోర్లు ఉన్నప్పటికీ లక్షలు వెచ్చించి వేసిన పైపులైన్ కాంట్రాక్టర్ పూర్తి మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. అలాగే పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా సైతం నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండు వేసవిలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాగునీటి కోసం గ్రామ మహిళలు, ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపడమే దీనికి నిదర్శనం. పంచాయతీ కార్యదర్శి జ్యోతిని వివరణ కోరగా గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు పడడం వాస్తవమేనని, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెండు రోజుల్లో పైపులైన్ పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
బూర్గుపల్లిలో ఇటీవల మిషన్ భగీరథ నీరు మురికిగా వచ్చినందున మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ డీఈ కరుణాకర్ గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికీ తిరిగి నీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీఓ కిషన్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, మాజీ సర్పంచ్ రేకులపల్లి మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్రామంలో ప్రత్యేకాధికారుల పాలన వచ్చినప్పటి నుంచి గ్రామంలో తాగునీటితో పాటు పారిశుధ్య పనులు పట్టించుకోవటం లేదు. గ్రామానికి పుష్కలంగా నీరు అందించే బోరు ఉన్నా పైపులైన్ మరమ్మతులు చేపట్టడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిరక్ష్యం వహిస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– రేకులపల్లి, మహిపాల్‌రెడ్డి, బూర్గుపల్లి మాజీ సర్పంచ్
మూడు నెలల నుంచి బిందెడు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నాం. దూరంగా ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. దినంలో ఎప్పుడొస్తాయో తెలియక రాత్రింబవళ్లు నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నాం. గ్రామానికి వచ్చే సార్లను అడిగితే మాకు సంబంధం లేదు అంటుండ్రు. మా నీటి గోస ఎవరి చెప్పుకోవాలో సమజైతలేదు. దండ పెట్టి అడుగుతున్నా పెద్దసార్లు జర మా ఊరి నీటి సమస్య పరిష్కరించడయ్యా.
-సుంకరి అనసూర్య, బూర్గుపల్లి