నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 08 : నల్లగొండ జిల్లాకే తలమానికమైన ఉన్నత విద్యా నిలయం, జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మైదానంలో చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురుగునీటి పారుదల కోసం డ్రైనేజీ కాల్వ నిర్మించడాన్ని తక్షణమే నిలిపియేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్ట శ్రీను మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కళాశాల మైదానం ఆక్రమణకు గురైతుందన్నారు. దానికి తోడు చుట్టుపక్కల కాలనీల మురుగు నీరు కోసం కాలేజీ వాకింగ్ ట్రాక్ పక్కనే డ్రైనేజీ నిర్మిస్తుండడం సరైంది కాదన్నారు. తక్షణమే పనులను ఆపివేసి కళాశాల మైదానంలో నుంచి కాకుండా వేరే వైపు నుంచి నిర్మాణం చేపట్టాలన్నారు.
డ్రైనేజీ భవిష్యత్లో పొంగినట్లయితే కళాశాల క్రీడా ప్రాంగణం మురుగుమయమైతుందని, దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. కొంతమంది నాయకులు, మున్సిపాలిటీ అధికారులు కళాశాల మైదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మున్సిపల్ అధికారులు కళాశాల భూమి విషయంలో అతిగా జోక్యం చేసుకుని ప్రిన్సిపల్ అధికారానికి అడ్డుపడుతున్నారని ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్, బీఆర్ఎస్వీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివప్రసాద్, టీఎస్ జేఏసి రాష్ట్ర కన్వీనర్ కత్తుల వంశీ ఉన్నారు.
NG College : ఎన్జీ కళాశాల మైదానంలో డ్రైనేజీ నిర్మాణం నిలిపివేయాలి : కట్టా శ్రీనివాస్