
నీలగిరి: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ జయశీల్‌రెడ్డి(42) అదృశ్యం తీవ్ర విషాదాంతమైంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం సమీపంలోని రాయికుంటలో మృత దేహాన్ని గత ఈతగాళ్లు వెలికితీశారు. సోమవారం ఉదయం వాకింగ్ కోసమని వ్యవసాయ క్షేత్రంలోని వెళ్లిన జయశీల్‌రెడ్డి కనబడకుండా పోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోని రెండు బావులు, చెరువు కుంటను జల్లెడ పట్టించారు.
నాగార్జున సాగర్‌కు చెందిన గజ ఈతగాళ్లును పిలిపించి మంగళవారం ఉదయం నుంచి ఆక్సిజన్ ద్వారా వారి వ్యవసాయ బావిలో దింపి గాలింపు చేపటా ్టరు. వీరితో పాటు పానగల్ ఉదయ సముద్రంలో చేపలు పట్టే గజ ఈతగాళ్లును కూడా పిలిపించి రాయికుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాయికుంటలో వలతో మృతదేహం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మధ్యాహ్న సమయంలో వల గుంజుతున్న సమయంలో ఖాజీరామారం చెందిన గజ ఈతగాళ్ల వలకు మృతదేహం తగిలి కొద్ది నిమిషాల్లో నీటిపై తెలింది. గమనించిన ఈతగాళ్లు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ నల్లగొం డ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. జయశీల్‌రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కి సోదరుడు కావడంతో గత రెండు రోజులుగా అక్కడే ఉన్న సుధీర్‌రెడ్డి మృతదేహం దొరికేంత వరకు పోలీసులు, ఈత గాళ్లతోనే ఉండి వారికి సూచనలు అందించారు.
జారీ పడినట్లుగా అనుమానం..
డాక్టర్ జయశీల్‌రెడ్డి జమైకాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసి రెండేండ్ల కితం ఇండియాకు వచ్చాడు. అతని తండ్రి జగదీశ్వర్‌రెడ్డి రిటైర్డ్ ప్రోఫెసర్ కాగా ఆయన సోదరి యుఎస్‌లో స్థిర పడింది. జయశీల్‌రెడ్డి గత నెలలో నే యుఎస్‌కు వెళ్లాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. తిరిగి ఈనెల 8న యుఎస్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
నల్లగొండలోని తన బంధువుల ఇంటిలో ఉంటూ తన అమ్మమ్మ గ్రామంలోని వ్యవసా య క్షేత్రం వద్దకు వెళ్తుండే వాడు. ఎప్పటిలాగే సోమవారం కూడా ఉదయం దర్వేశిపురానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని వ్యవసాయ క్షేత్రానికి వచ్చాడు. రోడ్డు పైనే కారు ఆపి డ్రైవర్‌ను అక్కడే ఉండమని చెప్పి తాను వాకింగ్ చేసి వస్తానని చెప్పి వ్యవసాయ క్షేత్రంలోని వెళ్లాడు. మధ్యలో జీతగాళ్లు ఎదురు కాగా వారి వద్ద కట్టె తీసుకుని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లాడు.

క్షేత్రం సమీపంలో ఉన్న చెరువు కుంట అలుగు పోస్తున్న ఫొటోలు ఇతర ఫొటోలు తీసి వాట్సప్ ద్వారా మేనమామ కోమటిరెడ్డి వినోద్‌రెడ్డికి పంపాడు, ఫొన్లో కూడా మాట్లాడాడు. అదే క్రమంలో గట్టు ఎక్కే ప్రయత్నం చేయగా కాలు జారి కుంటలో పడిపోయాడు. చేతిలోని కట్టెను భూమిలో బలంగా కుచ్చినట్లు.. పక్కనే జిల్లెడు చెట్టు పట్టుకుంటే చెట్టు కొమ్మలు తెగిన అనవాళ్లు కనబడ్డాయి. ముందుగా జయశీల్‌రెడ్డి సెల్పీ ఫొటోలు తీస్తున్న క్రమంలో జారి పడినట్లు అనుమానం వ్యక్తమైంది. కానీ ఫొన్ ప్యాంటు జేబులోకి ఏలా వెళ్తుంది అని సెల్ఫీ కోసం కాకుండా జారి పడినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు.
నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు…
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మృతదేహం లభ్యం కావడంతో వెంటనే కుంటలోంచి చేపలు పట్టే తెప్పలపై బయ టకు తీసుకు వచ్చారు. మృతదేహన్ని పరిశీలించగా ఎక్కడ ఎలాంటి గాయాలు లేవు. దీంతో మృతదేహాన్ని జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా వారు హైదరాబాద్‌కు తరలించారు. బుధవారం విద్యానగర్‌లోని సొంత గృహం వద్ద అంత్యక్రియలు జరుగనున్నాయి.

రెండు రోజులు వ్యవసాయ క్షేత్రంలోనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
డాక్టర్ జయశీల్‌రెడ్డి ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చిన్నమ్మ కొడుకు కావడంతో డాక్టర్ వ్యవసాయ క్షేత్రం లో ఆదృశ్యమైనట్లు సమాచారం అందగానే హైదరాబాద్ నుంచి హుటాహుటిన వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలతో కలిసి రెండు రోజులు ఇక్కడే ఉండి తన సోదరుడి ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు చేశారు.
ఇటు వ్యవసాయ క్షేత్రంలోని బావుల్లో, సమీపంలోని చెరువు కుంటలో వెతికిస్తూనే ఎక్కడికైనా వెళ్లాడా అనే కోణంలో మరో వైపు పోలీసుల చేత ఫొన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ సెల్ఫొన్ స్విచ్చాప్ కావడంతో ఆ దిశగా అన్వేషణ విడిచిపెట్టి వ్యవసాయ క్షేత్రంలోనే వెతికించారు.
విలపించిన బంధువులు…
డాక్టర్ జయశీల్‌రెడ్డి మృతదేహం కోసం సోమవారం ఉదయం నుంచి వెతికారు. వ్యవసాయ క్షేత్రంలోని బావుల్లో గజ ఈత గాళ్లు వెతికినా మృతదేహం దోరకలేదు. ఉదయ సముద్రంలో చేపలు పట్టే వారు వలలు వేసినా కుంటలో మృతదేహం దోరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు దాదాపుగా ఎక్కడికో వెళ్లి ఉంటాడని ఒక నిర్ధారణకు వచ్చారు.
దీంతో వారు ఉదయం నుంచి అక్కడే ఉండి సుమారు మూడుగంటల ప్రాంతంలో భోజనం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమం లో చెరువు కుంటలో వలలు తీసే క్రమంలో మృతదేహం బయటకు తేలింది. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. జయశీల్‌రెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. బంధువు లను ఓదార్చడం ఎవరివళ్ల కాలేదు.
