నందికొండ, ఆగస్టు 5 : తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తడంతో డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని స్పిల్‌వే మీదుగా దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు సోమవారం విడుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గానూ 584 (296.55 టీఎంసీలు) అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,61,455 క్యూసెక్కుల నీరు వచ్చి సాగర్‌కు చేరుతుండడంతో కలెక్టర్ నారాయణరెడ్డి, ఇరిగేషన్ ఇన్చార్జి సీఈ నాగేశ్వర్రావు, ఎన్నెస్పీ ఈఈ మల్లికార్జునరావుతో కలిసి నీటి విడుదలను ప్రారంభించారు.
డ్యామ్‌పై పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు చీరలతో వాయినం సమర్పించారు. ఉదయం 10.55 గంటలకు 13, 12వ క్రస్ట్ గేట్లను బటన్ నొక్కి నీటి విడుదలను ప్రారంభించారు. ఆ తర్వాత వరద ఉధృతిని తగ్గించడానికి గేట్లను ఎత్తుతూ క్రమంగా రాత్రి 10 గంటల వరకు 20 గేట్లు ఎత్తి 1,96,027 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ఆధారంగా క్రస్ట్ గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం జరుగుతుందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌కు 1,63, 220 క్యూసెక్కుల అవుట్ ఫ్లో, 3,23,331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.
రెండు పంటలకు నీరు అందిస్తాం : కలెక్టర్ నారాయణ రెడ్డి
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ సంవత్సరం రెండు పంటలకు సాగు నీరు అందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎడమ కాల్వ ద్వారా తాగు, సాగు నీటికి నీటి విడుదల కొనసాగుతుందని, నదిలో పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం ఉన్నందున ఈ ఏడాది పంటలకు నీటి కొరత లేదని చెప్పారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతంలో రైతులు, జాలర్లు, పశువుల కాపర్లు నదీ సమీపంలోకి వెళ్లరాదని సూచించారు.
పర్యాలకుల సందడి
డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు తరలివచ్చారు. క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న జలాలను వీక్షిస్తూ ఫొటోలు, సెల్ఫీలు దిగారు. డ్యామ్ పిల్లర్, ప్రధాన జల విద్యుత్ కేంద్రం, కొత్త బ్రిడ్జి, శివాలయం పుష్కరఘాట్ సమీపంలో పర్యాటకులతో సందడి నెలకొన్నది. ఇక పోలీసు, రెవెన్యూ అధికారులు నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొత్త బ్రిడ్జి, పవర్ హౌస్ వచ్చే దారిలో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.