గుర్రంపోడ్, నవంబర్ 8 : తేమ శాతం ఎకువగా ఉన్న ధాన్యం తూకం వేయడం, నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచడం, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, ప్యాడీ క్లీనర్లను వినియోగించకపోవడం, ధాన్యం రవాణాలో జాప్యం చేయడంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహ వ్యక్తం చేశారు. మండలంలోని కొప్పోలు, చామలేడు గ్రామాల్లో శుక్రవారం ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొప్పోలు కేంద్రంలో తూకం వేస్తున్న ధాన్యం కుప్పలో నుంచి ధాన్యాన్ని తీసుకుని తేమ శాతం పరిశీలించారు.
తేమ శాతం 22 వరకు చూపడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులను నిలదీశారు. తేమ శాతంను స్వయంగా పరిశీలించాల్సిన ఏఈఓను కలెక్టర్ ప్రశ్నించగా తాను లేని సమయంలో తేమ తీశారనడంతో ఏఈఓ రామాంజనేయులను, పీఏసీఎస్ సీఈఓ సాయికుమార్, సెంటర్ ఇన్చార్జి ధర్మయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుందని, కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు కలెక్టరు ఫిర్యాదు చేశారు. సెంటర్ను మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పనితీరు మార్చుకోకపోతే కమీషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. చామలేడు కేంద్రంలోనూ ఇదే రకమైన లోపాలను గుర్తించిన కలెక్టర్ తాను మరోసారి వచ్చి పరిశీలిస్తానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వి. వెంకటేశ్వర్లు, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తాసీల్దార్ జి.కిరణ్ కుమార్, ఎంపీడీఓ మంజుల, వ్యవసాయాధికారి కె. మాధవరెడ్డి, సివిల్ సప్లయి గిర్దావర్ రావుల సైదయ్య తదితరులు ఉన్నారు.