దామరచర్ల, జూన్ 26 : మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు విషజ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు కార్మికులు కొన్ని రోజులుగా జ్వరాలతో బాధపడుతూ పనులు చేయలేక స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఈ విషయంపై ప్లాంటు యాజమాన్యం సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేశారు. దాంతో కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి పవర్ ప్లాంటులోని ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి ఆధ్వర్యంలో బుధవారం ఐదు వైద్య బృందాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ముగ్గురు వైద్యాధికారులు, 50 మంది వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. 464 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 62 మందికి జ్వరాలు సోకినట్లు గుర్తించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపించారు. కొంత మందిలో డెంగీ లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పవర్ ప్లాంటు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జ్వరాలు సోకకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి వైద్యాధికారులు వివరించారు. జ్వరాలు తగ్గే వరకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని మండల వైద్యాధికారి నాగేశ్వర్రావు తెలిపారు.