మునుగోడు, ఏప్రిల్ 30 : మునుగోడు మండల కేంద్రంలో అదనపు గదుల నిర్మాణంతో పాటు, ఆధునీకరించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి మీటింగ్ హాల్, వ్యక్తిగత సిబ్బందికి అదనపు గదుల నిర్మాణం, క్యాంప్ కార్యాలయ ఆవరణలో సీసీ పనుల నిర్మాణంతో పాటు, ఎమ్మెల్యే నివసించడానికి వీలుగా భవనాలను ఆధునికరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చర్చించడానికి ఇది ఒక వేదికగా మారుతుందన్నారు. ఈ ప్రాంతం బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు. పేద ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందన్నారు.
మొదటి రోజే ఇందిరమ్మ గృహాల మంజూరుపై నూతన భవనంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో, ట్రాక్టర్, కారు నడుపుకుంటూ జీవనం కొనసాగించే పేదవాళ్లకి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కష్టమైందని మండలాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ మొదటి విడతగా అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు, తర్వాత విడతల వారీగా మిగతా అర్హులకు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా తమ బంధువని, స్నేహితుడని అనర్హుల పేర్లను జాబితాలో చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Munugode : అనర్హుల పేర్లను ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చొద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి