యాదాద్రి భువనగిరి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్య, వైద్య విభాగాలను గాలికి వదిలేసింది. రెగ్యులర్ అధికారులను నియమించకుండా ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నది. జిల్లాలో విద్య, వైద్య, గిరిజన, మైనార్టీ శాఖలకు బాస్‌లు లేరు. ఇటీవల పలువురు జిల్లా అధికారులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. తిరిగి అవి భర్తీ కాకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోతున్నాయి. కింది స్థాయిలో పర్యవేక్షణ కొరవడడం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారింది.
డీఎంహెచ్ఓ పోస్ట్ ఖాళీ..
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వేలాది మంది రోగాల బారిన పడుతున్నారు. ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. గత నెల వరకు డీఎంహెచ్‌ఓగా ఉన్న పాపారావు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మళ్లీ ఎవరూ రాలేదు. ప్రస్తుతం డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అన్ని జిల్లాల్లో వెంటనే నియమించినా మన దగ్గర మాత్రం ఇంకా నియామకం చేపట్టలేదు. జిల్లా అధికారి పర్యవేక్షణ కరువవడంతో వైద్యారోగ్య శాఖలో అంతా ఇష్టారాజ్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గిరిజన సంక్షేమ శాఖకు ఇన్చార్జీనే…
గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయి అధికారి లేరు. గతంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న మంగ్తానాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పటి నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. డీఆర్డీఓగా ఉన్న నాగిరెడ్డి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో హాస్టళ్లు, ఇతర సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో పథకాలు, కార్యక్రమాలు అంతంత మాత్రంగానే అమలు అవుతున్నాయి.
మైనార్టీ శాఖలో రెండేండ్లకు పైగా..
జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. గతంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా సత్యనారాయణ ఉండేవారు. ఆయన వెళ్లిపోయాక బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న యాదయ్యకు ఇన్చార్జీ బాధ్యతలు ఇచ్చారు. ఈ శాఖ పరిధిలో వక్ఫ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌ను కూడా భర్తీ చేయలేదు.
విద్యాశాఖలో ఇలా..
విద్యాశాఖ విషయానికి వస్తే.. ఇప్పటివరకు డీఈఓ నారాయణరెడ్డి సెలవులో వెళ్లి రెండు నెలలు అవుతున్నది. ఆయన స్థానంలో ప్రశాంత్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. నారాయణరెడ్డికి త్వరలో రిటైర్మెంట్ ఉంది. దాంతో ఆయన స్థానంలో కొత్త డీఈఓ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఎంఈఓల కొరత కూడా తీవ్రవంగా వేధిస్తున్నది. 17 మండలాల్లో మూడు, నాలుగు మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా అన్నిచోట్ల ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.